Friday, November 22, 2013

డా సి. నారాయణ రెడ్డి మానవత నారాధించే మధుర విపంచి

        మానవత నారాధించే   మధుర విపంచి
         డా సి. నారాయణ రెడ్డి 
{భాషా కుటీరం లో    రావూరు డా సి నారాయణ రెడ్డిగారికి సన్మానం చేసి  అభినందన సంచిక ప్రచురించింది అందులో రావూరు రచన .}
                 కాల పరిణామం లో సంవత్సరానికో వసంతం . కవికి జీవిత మంతా వసంతమే!అతని హృదయ ము ఆరామం .... భావాలు  పూల మొగ్గలు.శైలి పసిడి నిగ్గులు. ..... కావ్యాలు పొదరిళ్ళు -సందేశాలు పుప్పొళ్ళు. 
                సామాన్యం గా చెప్పుకోతగ్గ ఉపమానాలివి. కొందరు కవుల జీవితాలలో వసంతం ఒక పరువుగా వచ్చి మాయమవుతూ వుంటుంది . తిరిగి ఎప్పుడో చెప్పకుండా చివుళ్ళు పట్ట వచ్చు. ... వాటిలో ఒక మొగ్గ   తొంగి చూడవచ్చుఽవి గతించిన వసంతానికి   ఆనవాళ్ళుగా  నిలుస్తాయి...... మనల్ని పిలిచి అలనాటి చరిత్రను జ్ఞాపకం చే సుకొమ్మంటాయి. కాని,కాలాన్ని స్వంతం గా మలచుకొని -జీవితమంతా వసంతంగా మార్చుకోగల వారు కొద్ది మందే వుంటారు. 
                 ఆ   ఆరామంలో ఎన్ని కొత్త మొక్కలు వెలుస్తాయో,ఎన్ని విరులు విరుస్తాయో ,ఎంత మధుర మైన తేనె జల్లులు కురుస్తాయో-అంచనా వేయడం కశ్తమ్. ;అలా వేయబూనడం ఆ కవితా హృదయాన్ని వంచన చేయడమే అవుతుంది . 
               ఆయన చేతిలో   వంద కలాలు
            అలాటి అంచనాలను మించిన కవులలో  డా సి నారాయణ రెడ్డిగారొ కరు. చేతిలో వంద కలాలున్నట్లు ,తనలో అంతు లేని బలం వున్నట్లు ,ఆయన రచనలు సాగిస్తూ వుంటారు . కొత్తదనం చెడదు -మెత్తదనం పోదు. ..  వయసు అడ్డు రాదు-మనసు పస తప్పిపోదు ఆ ధునికాన్ధ్ర కవితా ప్రపంచంలో ఆయన ఒక స్థానం ఏర్పరుచుకొన్నారు. దానికి సుస్థి రత  కల్పించుకొన్నారు.
                        అటు సాహితీ రంగంలో ,ఇటు ఫిలిం ప్రపంచంలో ఆయన కవితలు పరుగులు తీస్తూనే వున్నాయి,సరస్వతి పాదాలకు గంధం పూస్తూనే వున్నాయి. .ఒక ప్ర క్క సన్మానాలు,ఒకప్రక్క  సత్కారాలు
ఒక ప్రక్క బహుమానాలు,ఒకప్రక్క కీర్తి తోరణాలు . ఆయన సవ్య సాచి అనిపించుకొన్నారు. భవ్య మనస్కుడని  అనిపించుకొన్నారు.
                      ఫిలిం రంగం లో ఆయన గేయరచయితగా "రికార్డు"నెలకొల్పు కొన్నారు". రెడ్డిగారి  పాట  లేందే ఫిలిం బయటికి రాదు-అసలు సెన్సారు ఆమోదించదు " అని హాస్యంగా అనుకోవడం కూడా కద్దు.రెడ్డి గారు వ్రాసినాన్ని ఫిలిం గేయాలు ఏభాషలో ఎవరు వ్రాసి వుండరు . అవి వెయ్యి ఏనాడో దాటి రెండో వెయ్యి నండుకోవడం కోసం ఉయ్యాలలూగుతూ ముందుకు ఉరుకు తున్నాయి. 
                విమానానిదే ఆలస్యం 
                 "గులేబ కావళి "  చిత్రం ద్వారా రెడ్డిగారు ఫిలిం పరిశ్రమకు పరిచయం అయారు. "నన్ను దోచుకొందు వటే " అన్న పాట వ్రాసిన వేళా విశేషం -అప్పటి నుంచీ  ఇప్పటి వరకు ఆయన కలం నిర్ఝరి లాగా పరుగెత్తుతూనే వుంది -వయ్యారాలు ఒలక బోస్తూనే వుంది . రెడ్డిగారివలె గేయ రచన చేయగల వారుండ వచ్చు కాని ఆయన కలం కల్పించిన వ్యామోహం ,మరొకరు కల్పించలెకపొయారు.హైదరాబాదులో నివాసం.మ దరా
సు లో కవితా విన్యాసం .విమానానిదే ఆలస్యంగానీ, కలానిది మాత్రం కాదు. 
                       ఇన్ని పాటలు వ్రాసినా -కొద్ది ప్రొడ్యుసర్ల బులపాటానికి వదిలితే -అన్నిటిలో భావ గాంభీర్యం ,భాషా సౌందర్యం,తొణికిస లాడుతోనే వుంటాయి . భావనా,చిత్రణా లేని గేయం ,సంపాదనా ,సౌజన్యం లేని భర్త వలె  పేలవం కాక తప్పదు. రెడ్డి గారు ప్రతి పాటలో తమ సహజ ప్రతిభను  వెలారుస్తూ వుంటారు. ..... పన్నీటి దీపాలు వెలిగిస్తూనే వుంటారు .
                   మల్లియలారా-మాలికలారా 
                    మౌనముగా నున్నారా...... 
                     మా కథ విన్నారా ?
       -వంటి అతి మధుర మైన గేయాలు వందల కొలది వున్నాయి. 
                 "పోలేవునీవు 
                 రాలేను నేను 
                 నీదారిలోనే నే 
                 నిలిచినాను -
     -వంటి భావ పూరిత మైన పాటలు ఎన్నో వున్నాయి. ఇలాటి వన్నీ ఏరితే ఏటి వొడ్డు  కోయిల గుంపులు ఒక్కసారిగా గొంతెత్తి కుహుకుహు  ధ్వానాలు చేసినట్లుంటుంది . ఇలాంటివెన్నో...... 
                    ఒక్క "ఏకవీర"చిత్రానికి  మాత్రంసంభాషణ 
లు వ్రాసారు . "సంభాషణలు వ్రాయాలనే కోరిక నాకు లేదు..... అదొక ప్రత్యేక కృ షి -తీరిక వుండాలి." అన్నారాయన  ఒకసారి .పాటలు వ్రాసి కెంపులు,పచ్చలు 
విసిరినట్లు విసిరి రావడం ఆయన అలవర్చుకొన్న విద్య.
               గ్రంధ రచనలో రెడ్డిగారు సిద్ధ హస్తులు .ఇప్పటికీ ఇరవై పైగా గ్రంధాలు వెలువడినాయి .ఆన్నిటిలోఏదో ప్రత్యేకత .... ఏదో ఉద్విగ్నత ..... ఉజ్వలత 
వచన కవితలో కొత్త పరవళ్ళు దిద్దింది వారి కలం .ఆపరవళ్ళలొ పాఠక లోకం మునిగి ముచ్చటలు పడుతూ వుంటుంది. రేడియో నాటికలకు జీవం పోసిన వారిలో వీరొకరు . 
             గేయ ప్రపంచానికి రత్న కిరీటం 
                       హిందీ,అరవం ,మరాఠీ ,వంగ భాషలలో కూడా ఏకవీ ఫిలింలకు ఇన్ని గేయాలు వ్రాసి వుండరు. అలాగే ఘంటసాల వారివలె ఏనేపథ్య గాయకుడు అన్ని పాటలు పాడి వుండడు . ఆ విధంగా ఒకరు ఫిలిం గేయ ప్రపంచానికి,మరొకరు సంగీత ప్రపంచానికి రత్న కిరీటాలు
గా అవతరించారు . ఇద్దరికీ జోహార్లు చెప్పక తప్పదు. 
                   సామాన్యంగా సరస్వతి చోటు చేసుకొన్న వీటిలో లక్ష్మి ప్రవేశించ దు . కవి ఎంత భోగలాలసుడో అంత చింతా క్రాంతుడుగా  వుండాలని ఆమె సంకల్ప మెమో!నారయణ రెడ్డి గారి విషయంలో ఇద్దరు సఖ్యత పడ్డారు . ఆయన ఇంట చెమ్మ చెక్క లాడుతూ వుంటారు. అందుకనే  ఆయన్ని "ఆంద్ర రవీంద్రుడు "అనాలనిపిస్తుంది . 
                వేములవాడ ప్రాంతం లోని హనుమాజీ పేటలో సింగిరెడ్డి వారింట జన్మించిన ఒక లేత మనసు,భీమేశ్వరాలయ ప్రాంగణం లో వలయాలుగా తిరిగే గానాలలో నుంచి సరిగమలు సంతరించుకొని .వాటి మీద సాహిత్యపు రజను జల్లుకొని ,తెలుగుతల్లి మెడలో వెలలేని హారాలు వెయ్యాలని కళలు గని -నేటికి డా నారాయణ రెడ్డి గా మారాడు . 
                       రెడ్డి రాజుల శౌర్యాన్ని ,ఆంధ్రుల వీరత్వాన్ని ,అమర కవుల భావనా పటిమను ,తెలుగు కవుల రచనా నైపుణ్యాన్ని ,ఆధునికుల ప్రగతి శీలతను పూల సజ్జలాంటి ఒజ్జల హృదయం ,సజ్జనులకు కానుకగా అమరే సౌజన్యం -ఆయన జీవితం లో ఇంద్ర ధనుస్సు లాగా ఒళ్ళు విరుచుకొన్నాయి-ఒంపులు దిద్దుకొన్నాయి. 
                     ఎన్నో చెప్పడం కంటే ఒక చిన్న మాట చాలుఈయన్ని గురించి అ దే ఆయన  జీవిత చరిత్ర లాంటి గ్రంధమవుతుంది . ఏమిటా ఒక్క మాట?....... "మానవత నారాధించే మధుర విపంచి -శ్రీనారాయణ రెడ్డి ". 
          ***********************************